- రాష్ట్రంలో 55.77 శాతం రైతుల రిజిస్ట్రేషన్ పూర్తి
- 67 శాతంతో ఫస్ట్ ప్లేస్‌లో ఖమ్మం, 35 శాతంతో లాస్ట్‌లో మేడ్చల్
- కేంద్ర పథకాలు అందాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరంటున్న ఆఫీసర్లు
- ఈ నెల 28తో ముగిసియనున్న రిజిస్ట్రేషన్ గడువు
ఖమ్మం, వెలుగు : ఆధార్ తరహాలోనే ప్రతి రైతుకు 11 అంకెల విశిష్ట సంఖ్య (ఫార్మర్ యూనిక్ ఐడీ) కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 55.77 శాతం మంది రైతులు పూర్తి చేసుకున్నారు.
రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ముందంజలో ఉంది. మిగతా జిల్లాలతో పోలిస్తే 67 శాతంతో ఖమ్మం ఫస్ట్ ప్లేస్‌లో నిలువగా.. 66 శాతంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఈ రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 28తో ముగియనుంది. దీంతో మరింత స్పీడ్‌గా చేపట్టేందుకు ఆఫీసర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా రైతులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తూ వారికి అవగాహన కల్పిస్తున్నారు. ‘రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమ అమలు సమయంలో కూడా ఈ రిజిస్ట్రేషన్ విధానాన్ని వివరించడంతో ఖమ్మం జిల్లాలో ఈ ప్రక్రియ వేగవంతానికి సాగింది.
ఖమ్మం టాప్.. మేడ్చల్ లాస్ట్
రాష్ట్రంలో 32 జిల్లాల్లో 74,93,527 పట్టాదారు పాస్‌బుక్‌లు ఉన్నాయి. ఇందులో 41,79,494 (55.77) శాతం మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో 3,40,072 పాస్‌పుస్తకాలు ఉండగా.. ఇప్పటివరకు 2,27,248 (66.82 శాతం) మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,22,732 పాస్‌పుస్తకాలు ఉండగా.. 81,133 (66.11 శాతం) మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు నిలిచాయి. రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా 34.76 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. 47.95 శాతంతో నల్గొండ జిల్లా 29వ స్థానంలో, 46.03 శాతంతో వికారాబాద్ 30వ ప్లేస్‌లో, 39.63 శాతంతో రంగారెడ్డి జిల్లా 31వ స్థానంలో నిలిచాయి.
కేంద్ర పథకాలు అందాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి
వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను అనుసంధానం చేయాలని నిర్ణయించారు. భూమి ఉన్న ప్రతి రైతు తన భూయాజమాన్య వివరాలతో ఆధార్ అనుసంధానం చేయడం ద్వారా ఫార్మర్ ఐడీని కేటాయిస్తున్నారు.
రెవెన్యూ శాఖ దగ్గర ఉన్న భూయాజమాన్య రికార్డుల ఆధారంగా మాత్రమే దీన్ని నమోదు చేస్తున్నారు. పీఎం కిసాన్ లబ్ధిదారులకు ఇక నుంచి ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఆఫీసర్లు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఇతర స్కీములైన సాయిల్ హెల్త్ కార్డు, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన వంటి పథకాల అమలుకు ఈ రిజిస్ట్రేషన్ నంబర్ కీలకం కానుంది.
అయితే రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాల అమలుకు ఈ ఫార్మర్ రిజిస్ట్రీతో సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. రైతు వివరాలు ఖచ్చితంగా నమోదై ఉండడం వల్ల పథకాల అమల్లో పారదర్శకత పెరుగుతుందని చెబుతున్నారు.
ఈ నెల 28 వరకే గడువు
రైతు రిజిస్ట్రేషన్‌కు భూమి పట్టాదారు పాస్‌బుక్ వివరాలు, ఆధార్ కార్డు నంబర్, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ అవసరం అవుతాయి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే రైతులు తమ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు వెళ్లిగానీ, లేదంటే రైతు వేదికలో ఉన్న ఏఈవోల ద్వారా గానీ ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. రైతు రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల 28 వరకే గడువు ఉండడంతో ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోనిరైతులు మీ సేవ కేంద్రాన్ని గానీ, ఏఈవోలను గానీ కలవాలని సూచిస్తున్నారు.
